Military Cargo Planes: ఈ పరిశ్రమ ఏర్పాటుతో రతన్ టాటా ఆత్మ సంతోషిస్తుంది: ప్రధాని మోదీ
- దేశ రక్షణ రంగంలో నేడు కీలక ఘట్టం
- ఇకపై దేశీయంగానే సైనిక రవాణా విమానాల తయారీ
- ఎయిర్ బస్ సహకారంతో పరిశ్రమ ఏర్పాటు చేసిన టాటా సన్స్
గత కొన్ని సంవత్సరాలుగా భారత్ స్వావలంబన కోసం శ్రమిస్తోంది. ముఖ్యంగా, రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించాలన్న కృషితో, ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలను దేశీయంగా తయారుచేయడంపై దృష్టి సారించింది.
ఈ క్రమంలో దేశ రక్షణ రంగ ఉత్పాదన పరిశ్రమలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్ లోని వడోదరలో మిలిటరీ రవాణా విమానాల ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభమైంది. స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఈ పరిశ్రమను ప్రారంభించారు. ఈ మిలిటరీ కార్గో విమానాల పరిశ్రమను ఎయిర్ బస్ సంస్థ సహకారంతో టాటా సన్స్ సంస్థ నెలకొల్పింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, రతన్ టాటా ఉంటే ఈ కార్యక్రమం చూసి ఎంతో సంతోషించేవారని, ఈ పరిశ్రమ ఏర్పాటుతో రతన్ టాటా ఆత్మ సంతోషిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమంతో మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ కార్యాచరణ మరింత దృఢతరం అవుతుందని పేర్కొన్నారు.
ఇక్కడ తయారైన సైనిక రవాణా విమానాలను విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో పౌర విమానాలను కూడా భారత్ లోనే తయారుచేస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ లో రక్షణ రంగ తయారీ వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ పరిశ్రమ భారత్-స్పెయిన్ సంబంధాలను బలోపేతం చేస్తుందని, భారత్-స్పెయిన్ భాగస్వామ్యం సరికొత్త దిశగా ముందుకు వెళుతోందని మోదీ అన్నారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, రెండేళ్లలో తొలి విమానాన్ని సైన్యానికి అందిస్తామని వెల్లడించారు.