Konda Surekha: కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పిటిషన్ల కేసు.... విచారణ వాయిదా
- కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువునష్టం పిటిషన్ల దాఖలు
- కొండా సురేఖ తరఫున న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టుకు హాజరు
- తదుపరి విచారణను నవంబర్ 13కు వాయిదా వేసిన కోర్టు
నాగచైతన్య, సమంత విడాకులు, తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో నాగార్జున వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున ఆమె న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 13వ తేదీన జరగనుంది.
తనపై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. గత విచారణ సందర్భంగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేటీఆర్ మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు. అంతకుముందు, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు వాంగ్మూలం నమోదు చేశారు.