Raj Pakala: విచారణలో పోలీసులు అడిగిన వాటికి సమాధానం చెప్పా: కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల
- పోలీసుల విచారణకు సహకరించానన్న రాజ్ పాకాల
- మా ఇంట్లో పార్టీ చేసుకున్నామన్న కేటీఆర్ బావమరిది
- పోలీసుల వైఖరి వల్ల తమ కుటుంబం చాలా డిస్టర్బ్ అయిందన్న రాజ్ పాకాల
తాను పోలీసుల విచారణకు సహకరించానని... అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల వెల్లడించాడు. జన్వాడ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి మోకిల పోలీసులు ఆయనను ప్రశ్నించారు. బీఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఈరోజు సుదీర్ఘంగా విచారించారు.
పోలీసుల విచారణ అనంతరం రాజ్ పాకాలను మీడియా పలకరించింది. విచారణకు సహకరించానని తెలిపాడు. ఫాంహౌస్‌లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అన్నాడు. మా ఇంట్లో మేం ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదా? అన్నాడు. పోలీసుల వైఖరి వల్ల తమ కుటుంబం చాలా డిస్టర్బ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విజయ్ మద్దూరి పోలీసుల వద్ద తమకు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు. అయినా అక్కడకు వచ్చిన వారిలో ఎవరో ఒకరకి డ్రగ్ పాజిటివ్ వస్తే తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కావాలనే ఈ అంశాన్ని పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
రాజ్ పాకాల విచారణ పూర్తయిందని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. ఈ కేసు దర్యాఫ్తు దశలో ఉందన్నారు. అవసరమైతే రాజ్ పాకాలను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు. మరోవైపు, తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, విచారణకు హాజరు కాలేనని విజయ్ మద్దూరి పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు ఆయన తన లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం పంపించాడు.