Nara Lokesh: గూగుల్ క్లౌడ్ సీఈఓ, వైస్ ప్రెసిడెంట్‌లతో మంత్రి లోకేశ్ భేటీ

Minister Nara Lokesh Met Google Cloud CEO Thomas Kurian

  • విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి
  • యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాల‌ని కోరిన మంత్రి
  • ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల‌ని అభ్య‌ర్థ‌న‌

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ఏపీ విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌ శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్) లతో భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆన్‌లైన్ రీసెర్చ్‌, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 2.01 ట్రిలియన్ డాల‌ర్లుగా ఉందని తెలిపారు. 

అనంత‌రం మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా తయారవుతోంద‌ని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించిన‌ట్లు పేర్కొన్నారు. పీపీపీ మోడ్ లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల‌ని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతమ‌న్నారు. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేస్తోంద‌ని తెలిపారు. 

ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల‌న్నారు. 

డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాల‌ని మంత్రి లోకేశ్‌ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ... సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News