Elon Musk: పిల్లల కోసం రూ. 295 కోట్లతో విశాల భవనం కొనుగోలు చేసిన మస్క్
- 11 మంది పిల్లలు, వారి తల్లులను ఒక్క చోటకు చేర్చేందుకు మస్క్ భవనం కొనుగోలు
- టెక్సాస్‌లోని తన ఇంటికి పది నిమిషాల దూరంలో ఆస్టిన్‌లో కొనుగోలు
- అందరూ ఒక దగ్గర ఉంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని మస్క్ నమ్మకం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లలు, వారి తల్లుల కోసం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో దాదాపు రూ. 295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో విశాలమైన భవంతిని కొనుగోలు చేశారు. 14,400 చదరపు అడుగుల ఈ భవనాన్ని ఆనుకుని ఉన్న ఆరు బెడ్రూంల విల్లాను కూడా కొనుగోలు చేశారు. టెక్సాస్‌లోని ఎలాన్ మస్క్ నివాసానికి ఈ భవనం పది నిమిషాల దూరంలోనే ఉంది. పిల్లలందరినీ ఒక చోట చేర్చడంతో వారంతా కలసి మెలసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని మస్క్ పేర్కొన్నారు.
మస్క్‌కు మొత్తం 12 మంది సంతానం. మాజీ భార్య జస్టిన్ మస్క్‌కు పుట్టిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో పది వారాలకే చనిపోయింది. ఈ జంట విడిపోవడానికి ముందు ఐవీఎఫ్ పద్ధతిలో 2008లో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మస్క్ బ్రిటిష్ నటి టలాలా రిలేను వివాహం చేసుకుని రెండుసార్లు విడాకులిచ్చారు. వీరికి పిల్లలు లేరు.
2020-2022 మధ్య గాయని గ్రిమ్స్‌తో మస్క్ మరో ముగ్గురు పిల్లల్ని కన్నారు. ప్రస్తుతం ఈ పిల్లలు ఎవరి వద్ద ఉండాలన్న విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిల్లిస్‌తో మస్క్ 2021లో రహస్యంగా కవలలకు జన్మినిచ్చారు. ఆ తర్వాత వీరికి మరో బిడ్డ జన్మించినట్టు మస్క్ ఇటీవలే వెల్లడించారు.