Virat Kohli: రోహిత్, విరాట్ మళ్లీ విఫలం.. ముగిసిన ముంబై టెస్ట్ తొలి రోజు ఆట

India lost 4 wickets at the end of the first day of the first innings in Mumbai Test
  • మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • 4 పరుగులకు కోహ్లీ, 18 రన్స్ కొట్టి రోహిత్ శర్మ ఔట్
  • రాణించిన న్యూజిలాండ్ బౌలర్లు
  • తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయిన కివీస్
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. కోహ్లీ కేవలం 4, రోహిత్ శర్మ 18 పరుగులు చేసి ఔట్ అయ్యారు. విరాట్ రనౌట్ కాగా, మాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ ఔట్ రూపంలో నిష్ర్కమించారు. 

ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేయగా, నైట్ వాచ్ మన్ గా బరిలో దిగిన మహ్మద్ సిరాజ్ 1 కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్లు నష్టపోయి 86 పరుగులు చేసింది. ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది. ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ (1 బ్యాటింగ్), శుభ్‌మాన్ గిల్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజీజ్ పటేల్‌ 2, మాట్ హెన్రీ 1 వికెట్ తీశారు. విరాట్ కోహ్లీని మ్యాట్ హెన్రీ రనౌట్ చేశాడు.

అదరగొట్టిన జడేజా, వాషింగ్టన్ సుందర్
అంతకుముందు, వాంఖడే పిచ్‌పై ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశారు. దీంతో 235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. మరో వికెట్‌ను పేసర్ ఆకాశ్ దీప్‌ తీశాడు.

న్యూజిలాండ్ బ్యాటర్ల స్కోర్లు ఇవే..
82 పరుగులు సాధించిన డారిల్ మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో  విల్ యంగ్ 71, టామ్ లాథమ్ 28, డెవాన్ కాన్వే 4, రచిన్ రవీంద్ర 5, టామ్ బ్లండెల్ 0, గ్లెన్ ఫిలిప్స్ 17, ఇష్ సోధి 7, మాట్ హెన్రీ 0, అజాజ్ పటేల్ 7, విలియం ఒరూర్కే 1 (నాటౌట్) పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Virat Kohli
Rohit Sharma
Mumbai Test
India Vs New Zealand
Cricket

More Telugu News