Rishabh Pant: వేలంలో రిషబ్ పంత్ ధరపై అంచనాలు పైపైకి... తాజా లెక్క ఇదే!

Cricket insiders expect Rishabh Pant  to get anything between Rs 25 crore to Rs 30 crores

  • పంత్ కోసం ప్రధానంగా 4 జట్ల మధ్య పోటీ ఉంటుందని అంచనా
  • అసలు పోటీ రూ.20 కోట్ల నుంచి మొదలవుతుందంటూ ఊహాగానాలు
  • రూ.25-30 కోట్లు పలికే అవకాశం ఉందని విశ్లేషిస్తున్న క్రికెట్ వర్గాలు

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అతడు అందుబాటులో ఉండనున్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్‌ అయ్యర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ కూడా వేలంలో ఉండబోతున్నప్పటికీ.. పంత్‌పైనే అందరి దృష్టి నెలకొంది. పంత్ ధర ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించే అవకాశం ఉందంటూ విశ్లేషణలు ఊపందుకున్నాయి.

పంత్ కోసం... ప్రధానంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు మరో రెండు జట్లు పోటీ పడవచ్చని చర్చలు మొదలయ్యాయి. ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) కార్డుని ఉపయోగించి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తిరిగి సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కెప్టెన్ కావాలనే వ్యూహంతో పంత్‌ను దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వేలంలో రిషబ్ పంత్ కోసం నిజమైన పోటీ రూ.20 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని ఓ ఫ్రాంచైజీకి చెందిని వ్యక్తి అంచనా వేశారు. కొత్త కెప్టెన్ అవసరమైన పంజాబ్ వద్ద రూ. 110.5 కోట్లు, ఆర్సీబీ వద్ద రూ.83 కోట్లు, ఎల్‌ఎస్‌జీ వద్ద రూ.69 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

నిజానికి గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అవసరం లేదని, అయితే రూ.69 కోట్లు ఉండడంతో పంత్ కోసం పోటీ పడే అవకాశం లేకపోలేదని అన్నారు. పంత్‌ను విడుదల చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.73 కోట్లు ఉండడంతో ఆర్టీఎం కార్డును ఉపయోగించే ఛాన్స్ కూడా ఉందన్నారు. మొత్తంగా చూస్తే పంత్‌ ధర రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల మధ్య పలికే చాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్ మూడవ వారంలో జరగనుంది. రెండు రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది.

  • Loading...

More Telugu News