Heavy Rain: భారీ వర్షంతో తడిసిముద్దయిన హైదరాబాద్ నగరం

Heavy down pour in Hyderabad city

  • నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ
  • ఆ తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం
  • గంట పాటు భారీ వర్షం
  • నగరంలోని పలు ప్రాంతాలు జలమయం 

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సిటీలోని అనేక కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. నిజాంపేట్, మేడ్చల్, ఖైరతాబాద్, మలక్ పేట్, మియాపూర్, కొండాపూర్, మూసాపేట్, మెహెదీపట్నం, కేపీహెచ్ బీ కాలనీ, దుండిగల్, కండ్లకోయ, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, చార్మినార్, మల్లంపేట్, బోయిన్ పల్లి, కృష్ణాపూర్, మణికొండ, హైటెక్ సిటీ, బేగంపేట, గండి మైసమ్మ, లింగపల్లి, మాదాపూర్ ప్రాంతాలు భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి. 

లింగపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద భారీ నీరు నిలవడంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ ను ఆపేశారు. గచ్చిబౌలి-లింగపల్లి రూట్లో వచ్చే వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా మళ్లించారు. ఓ చోట ఆర్టీసీ బస్సులోకి నీరు ప్రవేశించడం సోషల్ మీడియాలో ఓ వీడియోలో కనిపించింది. 

హైదరాబాదులో ఇవాళ మధ్యాహ్నం వరకు వాతావరణం వేడిగా ఉండగా... ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News