IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్‌లో యంగ్ ప్లేయర్లకు జాక్‌పాట్.. లక్షల నుంచి ఏకంగా కోట్లకు పెరిగిన వేతనం!
- రూ. 20లక్షల నుంచి రూ.14కోట్లకు పెరిగిన ధ్రువ్ జురెల్ జీతం
- 6,400 శాతం పెంపుతో రూ. 13కోట్లు దక్కించుకున్న మతీషా పతిరణ
- 55 రేట్లు పెరిగిన రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ శాలరీలు
ఐపీఎల్-2025 రిటెన్షన్‌లో పలువురు యంగ్ ప్లేయర్లు జాక్‌పాట్ కొట్టేశారు. కొన్ని జట్లు తాము అనుకున్న ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి వారిపై కోట్లు గుమ్మరించాయి. దాంతో కొంతమంది ఆటగాళ్ల జీతాలు అమాంతం పెరిగిపోయాయి. లక్షల నుంచి ఏకంగా కోట్లకు పడగెత్తాయి. ప్రధానంగా ఐదారుగురు యువ ఆటగాళ్ల శాలరీలైతే వేల శాతాలలో పెరగడం గమనార్హం. ధ్రువ్ జురెల్ (6,900 శాతం), మతీషా పతిరణ (6,400 శాతం), రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ (5,400 శాతం).
1. ధ్రువ్ జురెల్
ఈ ఐపీఎల్ రిటెన్షన్‌లో యువ వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు భారీ జాక్‌పాట్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ఈసారి అత్యధికంగా శాలరీ పెరిగింది ఈ యువ ఆటగాడికే. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున అంత మంచి ప్రదర్శన చేయకపోయినప్పటికీ, తమ జట్టు భవిష్యత్తు కోసం ఫ్రాంచైజీ జురెల్‌కు భారీగానే చెల్లించి రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో ఈ కీపర్ జీతం కేవలం రూ. 20 లక్షలుగా ఉంటే, ఈసారి రిటెన్షన్‌లో ఏకంగా రూ. 14 కోట్లకి పెరిగింది. ఇది జీతంలో 6,900 శాతం లేదా 69 రెట్లు పెరుగుదలకు సమానం.
2. మతీషా పతిరణ
గత రెండు సీజన్లలో ఈ యువ శ్రీలంక పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బౌలింగ్ లైనప్‌లో బాగానే స్థిరపడ్డాడు. డెత్ ఓవర్లలో తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో ఎల్లో ఆర్మీకి మ్యాచ్ విన్నర్‌గా మతీషా పతిరణ నిరూపించుకున్నాడు. దాంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈసారి ఈ బౌలర్‌ను కొనసాగించడానికి భారీగానే వెచ్చించింది. ఏకంగా 6,400 శాతం జీతం పెంచింది. దాంతో గత సీజన్‌లో కేవలం రూ. 20లక్షలుగా ఉన్న మతీషా పతిరణ శాలరీ ఇప్పుడు ఏకంగా రూ. 13 కోట్లకు పెరిగింది.
3. రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యువ బ్యాటర్ రజత్ పాటిదార్‌పై నమ్మకంతో ఏకంగా రూ. 11 కోట్లు చెల్లించి మరీ రిటైన్ చేసుకుంది. దాంతో రజత్ పాటిదార్ శాలరీ గతం కంటే 5,400 శాతం లేదా 55 సార్లు పెరిగింది. గత సీజన్‌లో అతని జీతం కేవలం రూ. 20లక్షలు మాత్రమే. 2024 ఐపీఎల్ సీజన్‌లో ఈ యంగ్ ప్లేయర్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును క్లిష్ట సమయాల్లో ఆదుకున్నాడు. అదే ఇప్పుడు అతని శాలరీ భారీగా పెరగడానికి కారణమైంది. ఐపీఎల్ 2024లో ఆర్‌సీబీ అద్భుతమైన పునరాగమనం చేయడానికి ప్రధాన కారణాలలో రజత్ పాటిదార్ ఒకరు.
లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)కి ఆడుతున్న మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో పలుమార్లు గాయపడడం దురదృష్టకరం. అయినప్పటికీ అతను ఆడిన కొన్ని మ్యాచ్‌లలో అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. వేగంతో పాటు కచ్చితత్వంతో బౌలింగ్ చేసి మెప్పించాడు. అతని ప్రతిభను గుర్తించిన ఎల్ఎస్‌జీ మేనేజ్‌మెంట్ భవిష్యత్‌లో తమ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా ఎదగగలడనే నమ్మకంతో మయాంక్‌ను ఏకంగా రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో రూ. 20 లక్షలుగా ఉన్న జీతం ఇప్పుడు రూ. 11 కోట్లకు చేరింది. పాటిదార్ లాగానే, యాదవ్ మునుపటి జీతం కూడా INR 20 లక్షలు. ఇది జీతంలో 5,400 శాతం లేదా 55 రెట్ల పెరుగుదలకు సమానం.
వీరితో పాటు సాయి సుదర్శన్ కు(గుజరాత్ టైటాన్స్)- రూ. 20 లక్షల నుంచి రూ. 8.50కోట్లు, శశాంక్ సింగ్ కు రూ. 20 లక్షల నుంచి రూ. 5.50 కోట్లు, రింకూ సింగ్ కు రూ. 55 లక్షల నుంచి రూ. 13 కోట్లకు పెరిగాయి.