ap govt: నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను మళ్లీ పట్టాలెక్కించిన ఏపీ ప్రభుత్వం
- అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అందించిన కూటమి ప్రభుత్వం
- నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు
- ఫిజికల్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం
ఏపీలో నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 లో నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 4,59,182 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అభ్యర్ధులు పరీక్షలో అర్హత సాధించారు. అయితే ఫిజికల్ టెస్ట్‌కు 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
ప్రిలిమినరీ పరీక్షల తర్వాత కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పలు కారణాలతో నిలిచిపోయింది. దీంతో నిలిచిపోయిన భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇన్‌చార్జి చైర్మన్ ఆకే రవికృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు.
ఫిజికల్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. వారు ఈ నెల 11న సాయంత్రం 3 సాయంత్రం నుంచి సాయంత్రం 5 గంటల వరకు slrb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.