Prashant Kishor: ఏదైనా రాజకీయ పార్టీకి సలహాలిచ్చేందుకు.. ఎన్నికల వ్యూహకర్తగా ప్ర‌శాంత్ కిశోర్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

Prashant Kishor reveals his fee for advising in one election

  • ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు పీకే ఫీజు రూ. 100 కోట్లు
  • బీహార్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఫీజును వెల్లడించిన ప్ర‌శాంత్ కిశోర్‌
  • ఇటీవ‌లే జన్ సూరజ్ పేరిట కొత్త పార్టీ పెట్టిన ఎన్నికల వ్యూహకర్త
  • నాలుగు చోట్ల త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టిన రాజకీయ విశ్లేషకుడు
  • బీహార్ ఉప ఎన్నికలు నవంబర్ 13న.. 23న ఫలితాలు

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు ఎంత ఫీజు తీసుకుంటార‌నే ఉత్సుకత అంద‌రికీ ఉండే ఉంటుంది. ఆయ‌న స‌ల‌హాల‌తో ఎన్నో పార్టీలు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగాయి. అందుకే ఆయ‌న‌ ఎన్నిక‌ల వ్యూహానికి తిరుగుండ‌దు అనేది చాలా మంది అభిప్రాయం. 

అయితే, తాజాగా తాను ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు ఎంత తీసుకుంటార‌నే వివ‌రాల‌ను ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. బీహార్‌లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిశోర్ తన ఫీజు వివ‌రాల‌ను వెల్లడించారు. 

బెలగంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నిక‌ల‌ ప్రచారాలకు ఎలా నిధులు సమకూరుస్తారో చెప్పాల‌ని ప్రజలు తనను తరచుగా అడుగుతారని ఆయ‌న పేర్కొన్నారు. వాటికి స‌మాధానంగా ఇప్పుడిలా త‌న ఫీజు వివ‌రాల‌ను ప్ర‌శాంత్ కిశోర్ వెల్ల‌డించారు. 

"వివిధ రాష్ట్రాలలో పది ప్రభుత్వాలు నా వ్యూహాలపై నడుస్తున్నాయి. నా ప్రచారానికి టెంట్లు, పందిరి వేయడానికి నా దగ్గర డబ్బు సరిపోదని మీరు అనుకుంటున్నారా? నేను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తే.. నా ఫీజు రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే. నేను అలాంటి ఒక ఎన్నికల సలహాతో నా ప్రచారానికి నిధులు సమకూర్చుకోగల‌ను" అని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. 

బీహార్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు జన్ సూరజ్ అభ్యర్థులను నిలబెట్టారు. బెలగంజ్ నుంచి మహ్మద్ అమ్జాద్ జన్ సూరజ్ పార్టీ అభ్యర్థిగా ఉంటే.. ఇమామ్‌గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్‌గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచి కిరణ్ సింగ్ బ‌రిలో ఉన్నారు. నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబ‌ర్ 23న ఫలితాలు వెల్ల‌డ‌వుతాయి.

  • Loading...

More Telugu News