KTR: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కావాలంటే ఆ లెక్కలు చూడండి: కేటీఆర్
- బీఆర్ఎస్ పథకాలను స్కాములు అంటూ ప్రచారం చేశారని మండిపాటు
- కేంద్రం లెక్కలు చూసి నిజాలు తెలుసుకోవాలని సూచన
- కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మారాలని హితవు
గత పదేళ్ల కాలంలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించిన లెక్కలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన పథకాలను స్కాములు అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్రం లెక్కలు చూశాక అయినా అసలు నిజం తెలుసుకోవాలని పేర్కొన్నారు. కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని... అద్భుతాలను చూసి ఇప్పటికైనా మారాలన్నారు.
పంటల దిగుబడితో పాటు పశుసంపదలోనూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో పండుగ కనిపించిందన్నారు. కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన, సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. మన రాష్ట్రంలోని డిమాండ్‌కు అనుగుణంగా మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశామన్నారు.
కేసీఆర్ ప్రతి ఆలోచన వెనుక సుదీర్ఘ అధ్యయనం ఉందన్నారు. కేసీఆర్ లక్ష్యం మేరకు ఆరోగ్య తెలంగాణ నిర్మాణం చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గొర్రెలు, చేప పిల్లల పంపిణీని నిలిపివేసిందని విమర్శించారు. తద్వారా కుల వృత్తులను రూపుమాపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.