Whatsapp: సెప్టెంబరులో 85 లక్షల ఖాతాలపై వాట్సాప్ నిషేధం
- వాట్సాప్ కు భారత్ లో 60 కోట్ల మంది యూజర్లు
- చెడ్డ ఖాతాలపై వాట్సాప్ కొరడా
- ఇక ముందు కూడా పారదర్శకంగా వ్యవహరిస్తామన్న వాట్సాప్
ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ చెడు ఖాతాలపై కొరడా ఝళిపించింది. ఒక్క సెప్టెంబరు నెలలోనే 85 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ ఖాతాలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వాట్సాప్ గుర్తించింది.
సెప్టెంబరు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాట్సాప్ మొత్తం 85,84,000 ఖాతాలను నిషేధించింది. వీటిలో 16,58,000 ఖాతాలను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే నిషేధించింది.
వాట్సాప్ కు భారత్ లో 60 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, వాట్సాప్ స్పందిస్తూ... పారదర్శకంగా వ్యవహరించడాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని, తమ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని భవిష్యత్ నివేదికల్లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది.
యూజర్లు తమకు నచ్చనివారిని బ్లాక్ చేసే సదుపాయం కల్పించామని, అభ్యంతరకర కంటెంట్ పై తమకు ఫిర్యాదు చేసే సౌలభ్యాన్ని యాప్ లో తీసుకువచ్చామని వాట్సాప్ వర్గాలు వివరించారు.