Train Accident: బ్రిడ్జిపై పట్టాలు శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన ట్రైన్.. కేరళలో నలుగురు దుర్మరణం
- పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోరం
- ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్
- పట్టాలపై మూడు మృతదేహాలు గుర్తించిన పోలీసులు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలను శుభ్రం చేస్తున్న కార్మికులపైకి ఓ ఎక్స్ ప్రెస్ ట్రైన్ దూసుకెళ్లింది. బ్రిడ్జిపైన ఉండడంతో తప్పించుకునే దారిలేక నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మూడు మృతదేహాలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉండగా.. మరో కార్మికుడి ఆచూకీ దొరకలేదు. ప్రమాదం తప్పించుకోవడానికి ఆ కార్మికుడు నదిలో దూకి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ ఈ ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో భరతపూజ నదిపై బ్రిడ్జి ఉంది. శనివారం సాయంత్రం బ్రిడ్జిపై చెత్తను తొలగించేందుకు నలుగురు కార్మికులు వెళ్లారు. వారు తమ పనిలో నిమగ్నమై ఉండగా కేరళ ఎక్స్ ప్రెస్ అదే ట్రాక్ పై దూసుకొచ్చింది. ట్రైన్ దూసుకొస్తున్న విషయం చివరి క్షణంలో గమనించినా తప్పించుకునే దారిలేక కార్మికులు పట్టాలపై నలిగిపోయారు. కాగా, మూడు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. నాలుగో కార్మికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భరతపూజ నదిలో స్థానికులతో కలిసి వెతుకుతున్నారు.