Virat Kohli: విరాట్, రోహిత్, జడేజా, అశ్విన్‌లను సాగనంపనున్న బీసీసీఐ?... ఆసీస్ తో సిరీసే చివరిదా?
- న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి
- నేపథ్యంలో సీనియర్లపై ఫోకస్
- ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కొందరు సీనియర్ల భవిష్యత్ పై నిర్ణయం!
- బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో విఫలమైతే తదుపరి సిరీస్‌కు మొండిచెయ్యి!
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 0-3 తేడాతో అవమానకర రీతిలో ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నలుగురు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల భవిష్యత్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ప్రారంభానికి ముందు ప్రణాళికాబద్ధంగా జట్టుని పటిష్టం చేయాలని భావిస్తున్న తరుణంలో కివీస్ చేతిలో ఇంత ఘోరంగా ఓడిపోవడంపై బీసీసీఐ దృష్టిసారిస్తుందని చర్చ మొదలైంది.
త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ తర్వాత కొందరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయించే అవకాశం ఉందని, ఈ దిశగా కీలక అడుగులు వేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చివరి దశలో ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఓ ఇద్దరికి ఆస్ట్రేలియా పర్యటనే చివరిది కావొచ్చని సమాచారం.
‘‘నవంబర్ 10న భారత జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరిన నాటి నుంచి నిర్ణయాలకు సంబంధించిన ఆలోచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియ అనధికారికంగానే జరగొచ్చు. కానీ ఇంగ్లాండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించకపోతే మాత్రం ఆ తర్వాత జరిగే 5 టెస్టుల సిరీస్ కోసం యూకేకి బయలుదేరే విమానంలో నలుగురు సూపర్ సీనియర్లు ఉండబోరని కచ్చితంగా భావించవచ్చు. ఇక స్వదేశంలో నలుగురు సీనియర్లకు న్యూజిలాండ్‌తో సిరీస్ చివరిది అయ్యి ఉండొచ్చు’’ అని బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్టు పీటీఐ కథనం పేర్కొంది.
సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై బీసీసీఐ పెద్దలు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని, జట్టుని ముందుకు నడిపించే మార్గంపై అనధికారిక చర్చలు జరపవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.