Vemireddy Prabhakar Reddy: బొకే ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ!

TDP MP Vemireddy walked out after he was being ignored by officials
  • నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఘటన
  • వేదికపై ఉన్న ఎంపీ వేమిరెడ్డిని విస్మరించిన అధికారులు
  • ఎంపీ వేమిరెడ్డితో పాటే వెళ్లిపోయిన అర్ధాంగి ప్రశాంతి రెడ్డి
  • అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తనకు బొకే ఇవ్వలేదంటూ టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ కూడా హాజరయ్యారు. 

అధికారులు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ అందరికీ బొకేలు అందించారు. నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష ప్రజాప్రతినిధుల పేర్లను పిలుస్తున్నారు. అయితే వేదికపై ఉన్న ఎంపీ వేమిరెడ్డి తనకు బొకే ఇవ్వకపోవడం పట్ల అవమానంగా భావించారు. ఆగ్రహంతో వెంటనే వేదిక దిగారు. 

మంత్రులు ఆయనకు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తనకు అవమానం జరిగిన చోట ఉండలేనని చెబుతూ, వేమిరెడ్డి తన అనుచరులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డితో పాటే ఆయన అర్ధాంగి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా అక్కడ్నించి నిష్క్రమించారు. 

కాగా, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ ఘటన నేపథ్యంలో, అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ కు, ఇతర అధికారులకు స్పష్టం చేశారు.
Vemireddy Prabhakar Reddy
Bouquet
Nellore District
TDP

More Telugu News