Sachin Tendulkar: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమిపై స్పందించిన సచిన్ టెండూల్కర్
- జీర్ణించుకోవడానికి చాలా కష్టమైన ఓటమి అన్న సచిన్
- ఆటగాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈ ఓటమి సూచిస్తోందని వ్యాఖ్య
- సన్నద్ధత లోపమా? లేక మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమా? అని ప్రశ్నించిన సచిన్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అత్యంత అవమానకర రీతిలో 0-3 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఇంత దారుణ పరాజయం ఎదురవడంపై మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ‘‘స్వదేశంలో 0-3 తేడాతో ఓడిపోవడం అన్నది మింగుడు పడని విషయం. ఈ ఓటమి ఆత్మపరిశీలనకు పిలుపునిస్తోంది. ఈ పరాజయానికి కారణం సన్నద్ధత లోపమా, షాట్ ఎంపిక విఫలమవ్వడమా లేక మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమా?’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
ఇక యువ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్‌పై సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. శుభ్‌మాన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఇక రిషబ్ పంత్ అయితే రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. తన చక్కటి ఫుట్‌వర్క్‌తో సవాలుతో కూడిన పిచ్‌ను భిన్నంగా మార్చి చూపించాడని అన్నాడు. ‘పంత్ సింప్లీ సూపర్బ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. సిరీస్ అంతటా నిలకడగా ఆడిన న్యూజిలాండ్‌కు ఘనత దక్కుతుందని సచిన్ ప్రశంసించాడు. భారత్‌లో 3-0తో టెస్ట్ సిరీస్ గెలవడమంటే చక్కటి ఫలితమని వ్యాఖ్యానించాడు.
కాగా ముంబై టెస్టులో భారత జట్టు 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో కొన్ని దశాబ్దాల తర్వాత స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైనట్టు అయింది. 147 పరుగుల లక్ష్య ఛేదనలో రిషబ్ పంత్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ చెలరేగాడు. తన స్పిన్ బౌలింగ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్ 90 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు సాధించాడు.