KTR: మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడంపై స్పందించిన కేటీఆర్, హరీశ్ రావు

Former ministers KTR and Harish Rao have condemned the arrest of former Sarpanchs statewide

  • పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్న
  • అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
  • సమస్యలు గాలికి వదిలి సీఎం, మంత్రులు ఊరేగుతున్నారని విమర్శించిన కేటీఆర్
  • పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేసిన హరీశ్ రావు

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ‘‘

"రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోంది. 
రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు. సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా? శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమానికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారని, అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.

అక్రమ నిర్బంధం అప్రజాస్వామికం: హరీశ్ రావు
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ‘‘ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల ఒంటి మీద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది’’ అని హరీశ్ రావు విమర్శించారు.

ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా? అని ఆయన ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News