Bus Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడడంతో 36 మంది దుర్మరణం
- సోమవారం ఉదయం మార్చులా వద్ద యాక్సిడెంట్
- ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
- రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో 36 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అల్మోరా జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్వాల్ నుంచి కుమావూ వెళుతున్న బస్సు మార్చులా వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న 200 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో వేగంగా స్పందించిన అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
బాధితులను కాపాడేందుకు శ్రమిస్తున్నారు. గాయపడ్డ ప్రయాణికులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో పరిస్థితి విషమించడంతో మరో 16 మంది కన్నుమూశారు. కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు సీఎం ధామి తెలిపారు.