Sports Policy: ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే రూ.7 కోట్లు ఇస్తాం... దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ: సీఎం చంద్రబాబు

CM Chandrababu suggests Rs 7 crores for Olympic gold medalists

  • ఏపీ కొత్త క్రీడా విధానంపై చంద్రబాబు సమీక్ష
  • క్రీడా పోటీల్లో పతకాలు గెలిచేవారికి భారీగా ప్రోత్సాహకాలు 
  • క్రీడా ప్రోత్సాహకాలు అందించడంలో దేశంలోనే నెంబర్ వన్ కానున్న ఏపీ

క్రీడా పోటీల్లో పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన రాష్ట్ర నూతన క్రీడా పాలసీపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా.....ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహలు ఇచ్చే రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.  

ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ.75 లక్షలు ఇస్తుండగా... ఇకపై రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు ఇస్తుండగా.....ఇకపై రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి ఇప్పటి వరకు రూ. 30 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. 

అంతేకాదు, ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు. అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.4 కోట్లు, రజత పతకం సాధించిన వారికి రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు.

వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. 

ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి గ్రూప్-1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు. 

ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్ లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News