MK Stalin: హీరో విజయ్ పొలిటికల్ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ ఏమన్నారంటే...!
- ఇటీవల తొలి రాజకీయ సభ నిర్వహించిన హీరో విజయ్
- డీఎంకే పార్టీని తమ రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించిన వైనం
- రాజకీయ పసికూనలు చేసే వ్యాఖ్యలు తాము పట్టించుకోబోమన్న స్టాలిన్
- విరోధులారా వర్థిల్లండి అంటూ అన్నాదురై వ్యాఖ్యలను గుర్తుచేసుకున్న వైనం
కోలీవుడ్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇటీవల తొలిసారిగా రాజకీయ సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో అధికార డీఎంకే పార్టీపై విజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకే పార్టీని తమ రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తామని ప్రకటించారు. విజయ్ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు.
విజయ్ పేరెత్తకుండా, విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు కూడా డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోవాలంటున్నారని తెలిపారు. ఇలాంటి రాజకీయ పసికూనలు చేసే వ్యాఖ్యలను డీఎంకే పట్టించుకోబోదని స్పష్టం చేశారు.
"వారికి ఇదే నా హృదయపూర్వక విజ్ఞప్తి... ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూడండి. మేం విజయవంతంగా త్వరలోనే నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా సీఎన్ అన్నాదురై మాటలను ఓసారి స్మరించుకుందాం. "విరోధులారా వర్థిల్లండి" అని అన్నాదురై నాడు చేసిన వ్యాఖ్యలే మాకు స్ఫూర్తి. ఇంతకంటే ఎక్కువగా స్పందించలేను.
ఎవరో ఏదో అంటే నేను అస్సలు పట్టించుకోను. ప్రజలకు సేవ చేయడంపైనే మా ప్రధాన దృష్టి. విమర్శించే వారందరికీ సమాధానం చెబుతూ పోవడం కుదరదు... టైమ్ వేస్ట్ తప్ప మరే ప్రయోజనం లేదు. మాకు ఉన్న సమయం అంతా ప్రజా సేవ కోసమే వినియోగిస్తాం. ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గత ఎన్నికలప్పుడు గెలిపించారో, అదే నమ్మకంతో మేం ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నాం" అని స్టాలిన్ వివరించారు.
తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో అనితా అచీవర్స్ అకాడమీ తరఫున సంక్షేమ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.