Narendra Modi: కెనడాలో హిందూ ప్రార్ధనా మందిరంపై దాడి... ప్రధాని మోదీ స్పందన
- బ్రాంప్టన్ నగరంలో ఘటన
- దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
- ఇలాంటి దాడులతో భారత్ ను బలహీనపర్చలేరన్న ప్రధాని మోదీ
వేర్పాటు వాదాన్ని ఎగదోస్తూ భారత్ కు ప్రతిబంధకంగా మారిన ఖలిస్తాన్ మద్దతుదారులు, కెనడా దేశాన్ని తమకు సురక్షిత ఆవాసంగా పరిగణిస్తుంటారు. గత కొంతకాలంగా కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమకారులకు బాసటగా నిలుస్తున్న ధోరణి కనిపిస్తోంది.
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి, కెనడా ప్రభుత్వం బాహాటంగానే భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తోంది. ఇదే అదనుగా, కెనడాలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై తరచుగా దాడులు జరుగుతున్నాయి.
తాజాగా, బ్రాంప్టన్ నగరంలో ఓ హిందూ ప్రార్థనా మందిరంపై దాడి జరిగింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కెనడాలో హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఇలాంటి దాడులతో భారత్ వైఖరిని బలహీనపర్చలేరని స్పష్టం చేశారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పిరికి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఘోరాలపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించాలని కోరుతున్నామని మోదీ స్పష్టం చేశారు.