US Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు?

When will the 2024 presidential election results be announced

  • ఇవాళ ఎన్నిక‌లు ముగిసిన కొన్ని గంట‌ల‌కే ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం
  • ఇంత‌కుముందు కొన్ని సందర్భాలలో జరిగినట్టుగా ఒక నెల, వారాలు పట్టే అవ‌కాశం 
  • 2020 ఎన్నిక‌ల ఫ‌లితాలు తేలడానికి వారం రోజులు ప‌ట్టిన వైనం
  • 2016లో మాత్రం త‌ర్వాతి రోజే ఫ‌లితం 
  • 2000 ఎన్నికల ఫ‌లితాల‌కు ఏకంగా నెల రోజులు ప‌ట్టిన వైనం

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఈరోజు ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే, బుధవారం ఉదయం నుంచే తెలిసే అవ‌కాశం ఉంది. లేదా ఇంత‌కుముందు కొన్ని సందర్భాలలో జరిగినట్టుగా ఒక నెల రోజులు, వారాలు పట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

2016లో నవంబర్ 8 సాయంత్రం ఓటింగ్ ముగిసింది. నవంబర్ 9 తెల్లవారుజామున 2:30 గంటలకు డొనాల్డ్‌ ట్రంప్ స్వింగ్ స్టేట్ అయిన‌ విస్కాన్సిన్‌లోని 10 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకోవడంతో రిప‌బ్లిక‌న్ పార్టీ మ్యాజిక్ సంఖ్య 270 ఎలక్టోరల్ ఓట్లను దాటింది. దాంతో ఆయ‌న అధ్య‌క్ష పీఠం అధిరోహించారు. 

అదే 2020లో నవంబర్ 3 సాయంత్రం పోలింగ్ ముగిసింది. అయితే, ప్రెసిడెంట్ జో బైడెన్ పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పొంద‌డంలో స‌మ‌యం ప‌ట్ట‌డంతో నవంబర్ 7 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే 2000 ఎన్నికలలో అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విజ‌యం సాధించ‌గా, విజేత‌ను తేల్చ‌డానికి ఒక నెల కంటే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింది. ఓటింగ్ నవంబర్ 7న ముగిస్తే, తుది ఫలితం డిసెంబర్ 12న తెలిసింది. 

అధ్య‌క్షుడు కావాలంటే ఎంత బ‌లం అవ‌స‌రం..
అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు మొత్తం జాతీయ ఓట్ల ద్వారా కాకుండా ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల వ్య‌వ‌స్థ ద్వారా జ‌రుగుతాయి. ఇది ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ అయిన‌ప్ప‌టికీ, నేరుగా ప్ర‌జ‌లు అధ్య‌క్షుడిని ఎన్నుకోరు. వారు త‌మ సొంత రాష్ట్రంలో ఎల‌క్ట‌ర్ల‌కు ఓటు వేస్తారు. ఈ ఎల‌క్ట‌ర్లు అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉండ‌గా, అభ్య‌ర్థి గెల‌వ‌డానికి 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు అవ‌స‌రం. 

ఎల‌క్టోర‌ల్ ఓట్ల గురించి..
ప్ర‌తి రాష్ట్రానికి జ‌నాభా ఆధారంగా ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉంటాయి. 50 రాష్ట్రాల‌లో జ‌నాభా ఆధారంగా ఎల‌క్టోర‌ల్ ఓట్లు 435 ఉన్నాయి. అలాగే ప్ర‌తి రాష్ట్రానికి 2 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సెనెట్ ద్వారా వ‌స్తాయి. త‌ద్వారా మొత్తం 535 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. వాషింగ్ట‌న్ డీసీకి 3 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎన్నికైన ప్రతినిధులు డిసెంబ‌ర్‌లో అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. జ‌న‌వ‌రిలో కాంగ్రెస్ ధ్రువీక‌రిస్తుంది. 

ఇక పోలింగ్ ముగింపు సమయం రాష్ట్రం నుండి రాష్ట్రానికి మరియు రాష్ట్రంలోని కౌంటీ నుండి కౌంటీకి మరియు కొన్నిసార్లు అదే కౌంటీలోని నగరాల వారీగా కూడా మారవచ్చు. ఒక‌వేళ 8 గంటలకు పోలింగ్ ముగిస్తే, ఆ తర్వాత క్యూలో ఉన్న వారు ఎంత సమయం పట్టినా ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది.

కాగా, స్వింగ్‌ స్టేట్స్ అయిన ఏడు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలే అమెరికా అధ్య‌క్షుడిని నిర్ణ‌యిస్తాయి. ఇక సోమవారం ఉదయం నాటికి 7.8 కోట్ల‌కు పైగా అమెరికన్ ఓటర్లు ముంద‌స్తు ఓటింగ్‌లో ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, యూఎస్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య 24.5 కోట్లు. 

  • Loading...

More Telugu News