Manda Krishna Madiga: జనసేన అందరి పార్టీయా, కాదా?: పవన్ కల్యాణ్‌పై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం

Manda Krishna Madiga fires at Pawan Kalyan

  • మూడో మంత్రి వేరే సామాజిక వర్గం నుంచి ఎందుకు లేడని ప్రశ్న
  • ఎన్నికల సమయంలో సీటు కోరితే ఇవ్వలేదని ఆవేదన
  • పవన్ కల్యాణ్ మీద తమ ఆవేదన ఇప్పటిది కాదన్న మంద కృష్ణ
  • హోంశాఖపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మంద కృష్ణ

జనసేన అందరి పార్టీయా? లేక ఒకటి రెండు కులాల పార్టీయా? అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. కూటమి కేబినెట్లో జనసేన తరఫున ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయని గుర్తు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తాము అర్థం చేసుకోగలమని... కానీ మూడో మంత్రి పదవిని మాత్రం బీసీకో... ఎస్సీకో... ఎస్టీకో ఇవ్వాలి కదా అన్నారు.

నాయకుడిగా మీరు, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్ మీ వెంటే ఉన్నారు కాబట్టి ఆయనకు ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టనని చెప్పారు. కానీ మూడో పదవి ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిందన్నారు. అప్పుడే సామాజిక న్యాయం పాటించినట్లు అవుతుందన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో రెండు సీట్లను, ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వేకోడూరులో జనసేన పోటీ చేసిందని, ఇక్కడ ఏదో ఒకచోట నుంచి తమ సామాజిక వర్గానికి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తాము పవన్ కల్యాణ్‌ను కోరామన్నారు. మూడు ఎస్సీ స్థానాలలో తాము ఒక్కటైనా ఇవ్వాలని కోరితే వాటిని మాలలకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే తాము తమ అసంతృప్తిని వ్యక్తం చేశామని... కలిసి ఆవేదన వెళ్లగక్కుతామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.

పవన్ మీద మా ఆవేదన ఇప్పటిది కాదు

పవన్ కల్యాణ్ అందరికీ పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటే ఆ పార్టీ తరఫున బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసేన కేవలం కాపులకు మాత్రమే పెద్దన్నగా కనిపిస్తోందని... మాకు అయితే ఆయన పెద్దన్న కాదని విమర్శించారు. పవన్ కల్యాణ్ మీద తమ ఆవేదన ఇప్పటిది మాత్రమే కాదన్నారు.

హోంశాఖపై పవన్ వ్యాఖ్యల మీద స్పందించిన మంద కృష్ణ

హోంమంత్రి అనిత శాఖ మీద పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మంద కృష్ణ స్పందించారు. పవన్ కల్యాణ్ శాఖలో ఏదో తప్పు జరిగితే మరో మంత్రి మాట్లాడటం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఆయన శాఖలో ఏదో లోపం జరిగితే... మరో మంత్రి కల్పించుకొని... పవన్ కల్యాణ్ వద్ద ఉన్న శాఖ నేను నడిపి చూపిస్తానని అంటే ఎలా ఉంటుంది? అని చురక అంటించారు. కేబినెట్ అంటే కుటుంబమన్నారు. హోంశాఖపై ఆయన చేసిన వ్యాఖ్యలను మంద కృష్ణ తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News