CM Chandrababu: రేపు ఐదు విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
- రూ.5407 కోట్ల వ్యయంతో 5 నూతన సబ్ స్టేషన్ల ప్రారంభంతో పాటు మరో 14 సబ్ స్టేషన్లు, లైన్ల శంకుస్థాపనకు సిద్దం చేసిన ఏపీ ట్రాన్స్‌కో
- రేపు (గురువారం) సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన ఇంధన శాఖ, ఏపీ ట్రాన్స్‌కో అధిపతులు
రాష్ట్రంలో విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ఏపీ ట్రాన్స్‌కో రాష్ట్ర వ్యాప్తంగా రూ.5407 కోట్ల వ్యయంతో వివిధ జిల్లాల్లో 5 నూతన సబ్ స్టేషన్లను ప్రారంభించడంతో పాటు, 14 సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణాలకు భూమి పూజ చేసే ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమానికి ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు.
రాజధాని ప్రాంతంలోని సీఆర్డీఏ పరిధిలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) తాళ్లాయపాలెం వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతే కాకుండా తాళ్లాయపాలెం జిఐఎస్‌తో కలుపుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5 సబ్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అలాగే మొత్తం 14 సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణాలకు సంబందించి భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఆర్‌డీఏలోని తాళ్లాయపాలెంలోని 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)లో ముఖ్యమంత్రి కార్యక్రమ వేదికను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంగళవారం సందర్శించి విద్యుత్తు శాఖ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. సంబంధిత ఎస్ఈలతో ఏర్పాట్లపై ఆయన చర్చించారు.
విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా రూ.5407 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, వివిధ సామర్థ్యాలతో సబ్ స్టేషన్లు, లైన్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు విజయానంద్ తెలిపారు.
.