US Presidential Polls: ఫిలడెల్ఫియా ఓటింగ్‌లో భారీ మోసం జరిగింది.. ట్రంప్ తీవ్ర ఆరోపణలు
- ఫిలడెల్ఫియాలో పెద్ద ఎత్తున ఓటింగ్
- అక్కడ చీటింగ్ జరిగిందన్న వార్తలు వస్తున్నాయన్న ట్రంప్
- ట్రంప్ ఆరోపణల్లో నిజం లేదన్న సిటీ కమిషనర్
- ఎన్నికలు పూర్తి భద్రత మధ్య జరిగాయని స్పష్టీకరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్ పెన్సిల్వేనియాలో ఓటింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్న వేళ.. అక్కడ భారీ మోసం జరిగిందని ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆరోపించారు. అక్కడ చీటింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, తన ఆరోపణలకు సంబంధించి ట్రంప్ ఎలాంటి ఆధారాలు చూపలేదు.
ట్రంప్ ఆరోపణలపై రిపబ్లికన్ అయిన సిటీ కమిషనర్ సెథ్ బ్లూస్టీన్ స్పందించారు. ఆయన ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని పేర్కొన్నారు. ఫిలడెల్ఫియాలో ఓటింగ్ పూర్తి భద్రత మధ్య జరిగినట్టు తెలిపారు. 2020 ఎన్నికల్లోనూ ట్రంప్ తన ఓటమిని ఇదే కారణంతో తిరస్కరించారు. ఈ ఎన్నికల్లోనూ ట్రంప్ ఓటమి పాలైతే మళ్లీ ఈ ఫలితాన్ని తిరస్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే పరాజయాన్ని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినట్టయితే దానిని అంగీకరించే మొదటి వ్యక్తిని తానే అవుతానని చెప్పుకొచ్చారు.