Thomas Draca: ఐపీఎల్ 2025 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న తొలి ఇటాలియన్ క్రికెటర్‌.. ఇంతకీ ఎవరీ థామస్ డ్రాకా?

Thomas Draca becomes first player from Italy to register for IPL
  • 409 మంది విదేశీ ఆటగాళ్లలో ఇటలీ నుంచి ఒకే ఒక్కడు
  • ఆల్ రౌండర్‌గా రూ. 30 లక్షల కనీస ధర కేటగిరీలో పేరు నమోదు
  • గ్లోబల్ టీ20‌లో బ్రాంప్టన్ వోల్స్‌కు ప్రాతినిధ్యం
  • అద్భుత ప్రతిభతో అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్న జాక్ 
ఇటలీ క్రికెటర్ ఒకరు తొలిసారి ఐపీఎల్ మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుండగా ఇటాలియన్ క్రికెటర్ థామస్ డ్రాకా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1,574 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 1,165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 

ఇటలీ నుంచి ఒకే ఒక్కడు
409 మంది విదేశీ ఆటగాళ్లలో ఇటలీ నుంచి రిజిస్టర్ చేసుకున్న ఒకే ఒక్క ఆటగాడు థామస్ జాక్ డ్రాకా. ఆ దేశం నుంచి ఐపీఎల్‌లో రిజిస్టర్ చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రైటార్మ్ సీమర్ అయిన జాక్ కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20‌లో బ్రాంప్టన్ వోల్స్‌కు ప్రాతినిధ్యం వహించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 10.63 సగటు, 6.88 ఎకానమీతో 11 వికెట్లు తీసి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

18 పరుగులకే మూడు వికెట్లు
సర్రేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 18 పరుగులకే మూడు వికెట్లు తీసి బెస్ట్ నమోదు చేశాడు. మిస్సిసౌగా, సర్రేతో జరిగి మ్యాచుల్లో వరుసగా 10 పరుగులకు మూడు, 30 పరుగులకు మూడు వికెట్లు తీసి తమ జట్టును పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలబెట్టాడు.  

ఆల్‌రౌండర్‌గా ఐపీఎల్‌లో నమోదు 
ఐపీఎల్ వేలంలో థామస్ జాక్ ఆల్‌రౌండర్‌గా రూ. 30 లక్షల కనీస ధర కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. త్వరలో యూఏఈలో జరగనున్న ఐఎల్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌కు ఆడనున్నాడు. 24 ఏళ్ల థామస్ ఈ ఏడాది జూన్‌లో లక్సెంబర్గ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో తన జట్టు 77 పరుగులతో విజయం సాధించింది.   
Thomas Draca
IPL Mega Auction
Italy
Brampton Wolves

More Telugu News