Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
- ఒక్క నెలలోనే రెట్టింపు అయిన ట్రంప్ సంపద
- 3.9 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ డాలర్లకు పెరుగుదల
- ట్రంప్ మీడియా గ్రూప్ షేర్లు వృద్ధి చెందడంతో సంపద వృద్ధి
- నెల వ్యవధిలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగిన షేర్ల విలువ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ట్రంప్... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నికర ఆస్తి విలువ ఎంతనేది చర్చనీయాంశంగా మారింది.
గత నెల అక్టోబర్ ఆరంభంలో సుమారు 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద విలువ ప్రస్తుతం రెట్టింపు అయింది. నెల వ్యవధిలోనే 8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.67 వేల కోట్లుగా ఉంది. ట్రంప్‌కు చెందిన మీడియా సంస్థ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్’ షేర్లు భారీగా లాభపడడమే సంపద పెరుగుదలకు కలిసొచ్చింది. దీంతో సెప్టెంబర్ చివరిలో 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ ఆస్తి విలువ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఐదు వారాల క్రితం 12.15 డాలర్లుగా ఉన్న ట్రంప్ మీడియా షేర్ విలువ ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. కంపెనీలో తనకు ఉన్న సుమారు 57 శాతం వాటాను విక్రయించబోనని ప్రకటించడంతో ట్రంప్ మీడియా షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో మే, మార్చి నెలల నాటి గరిష్ఠ స్థాయికి షేర్ల విలువ పెరిగింది. అయితే ట్రంప్ మీడియా షేర్లు కంపెనీ పనితీరు ఆధారంగా పెరగలేదని, ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో పెరిగాయని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
ఇక డొనాల్డ్ ట్రంప్‌కు క్రిప్టోకరెన్సీలతో పాటు ఇతర డిజిటల్ అసెట్స్ రూపంలో ఆస్తులు ఉన్నాయి. అయితే ట్రంప్ టవర్‌తో పలు ఇతర ఆస్తులు తాకట్టులో ఉన్నాయని, చట్టపరమైన తీర్పులకు సంబంధించిన కొత్త అప్పులు కూడా ఉన్నాయని ఎన్నికల సందర్భంగా ట్రంప్ ప్రకటించారు.