Ramayana: బాలీవుడ్ 'రామాయణ' రెండు పార్ట్‌ల విడుదల తేదీలు ఖరారు!
- రెండు పార్ట్‌లు తెరకెక్కిస్తున్న 'రామాయణ'
- 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్ విడుదల
- 2027 దీపావళికి రెండో పార్ట్ విడుదల
ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో 'రామాయణ' ఒకటి. నితేశ్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విశేషాలతో పాటు రిలీజ్ డేట్‌పై గత కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఎట్టకేలకు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చింది.
ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమా విడుదల తేదీలను తెలియజేస్తూ బుధవారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్‌ను, 2027 దీపావళికి సెకండ్ పార్ట్‌ను విడుదల చేస్తున్నట్లుగా ఆ ప్రకటనలో తెలిపింది. మొదటి పార్ట్ రావడానికే దాదాపు రెండు సంవత్సరాల సమయం వుంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన పలు న్యూస్‌లు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్న రణభీర్ సింగ్ ఈ చిత్రంలో పాత్ర కోసం ఆల్కహాల్‌ను మానేసి, ప్రత్యేక ఆహారాన్ని తీసుకుంటు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నాడు. ఈ చిత్రంలో సీత పాత్రలో ప్రముఖ కథానాయిక సాయి పల్లవి కనిపిస్తారు.
చిన్నప్పటి నుంచి స్వతహాగా దైవ భక్తురాలైన సాయి పల్లవి ఈ చిత్రంలో సీతమ్మ పాత్రను ఓ నటిగా కాకుండా, భక్తురాలిగా చేస్తున్నానని, ఇంత గొప్ప పాత్రలో నటించడం తన అదృష్టమని ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా ఈ సినిమాలో రావణుడిగా కేజీఎఫ్ యశ్, ఆంజనేయుడి పాత్రలో సనీ డియోల్, శూర్పణగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా కనిపిస్తారని సమాచారం.
ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్ కోసం దర్శకుడు హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ సంభాషణలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏఆర్ రెహమాన్‌తో పాటు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ సంగీతాన్ని అందిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.