Varra Ravindra Reddy: వైసీపీ కార్యకర్త రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు... సీఎం చంద్రబాబు ఫైర్
- 41-ఏ కింద నోటీసులు ఇచ్చి బుధవారం తెల్లవారుజామున పంపించిన పోలీసులు
- మరో కేసు విషయమై ఇంటికి వెళ్లగా రవీంద్రారెడ్డి పరారైనట్టు గుర్తింపు
- పోలీసుల తీరుపై ముఖ్యమంత్రితో పాటు డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆగ్రహం
- గతంలో చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో నాటి విపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు లోకేశ్, వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే బుధవారం తెల్లవారుజామున రవీందర్ రెడ్డిని వదిలేశారు. కడప తాలుకా పోలీసులు 41-ఏ నోటీసు ఇచ్చి అతడిని ఇంటికి పంపించి వేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి విడిచిపెట్టారు. అయితే మరో కేసు విషయమై వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అతడు పరారయ్యాడని గుర్తించారు. దీంతో రవీంద్రారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
ఆచూకీ కోసం అతడి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వర్రా రవీంద్రారెడ్డిపై మంగళగిరితో పాటు హైదరాబాద్‌లో కూడా పలు కేసులు ఉన్నాయి. నిన్న (మంగళవారం) పులివెందులలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి కడప తీసుకెళ్లి రహస్యంగా విచారించారు. అయితే అనూహ్యంగా వదిలిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
సీఎం చంద్రబాబు సీరియస్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టే తీసుకుని వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ రంగంలోకి దిగారు. ఇవాళ (బుధవారం) కడపలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆరా తీశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.