Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరెత్తకుండా... అమెరికా ఫలితాలపై స్పందించిన చైనా
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం
- అమెరికన్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామన్న చైనా
- ట్రంప్ పేరును ప్రస్తావించకుండా క్లుప్తంగా స్పందించిన చైనా ప్రతినిధి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై డ్రాగన్ కంట్రీ చైనా స్పందించింది. అయితే ట్రంప్ గురించి నేరుగా ప్రస్తావించకుండా, అమెరికా ప్రజలను ఉద్దేశించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ క్లుప్తంగా మాట్లాడారు. అమెరికాతో శాంతియుత సంబంధాలను తమ దేశం కోరుకుంటోందన్నారు.
పరస్పర గౌరవం, శాంతి సామరస్యం, విన్-విన్ సూత్రాల ఆధారంగా చైనా-అమెరికా సంబంధాలు కొనసాగుతాయన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ... తాము అమెరికన్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ పేరును మాత్రం చైనా ప్రతినిధి ప్రస్తావించలేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌నకు, ఆయన భార్య మెలానియాకు అభినందనలు తెలిపారు. అతిపెద్ద విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు అభినందనలు... వైట్ హౌస్‌కు మీ చారిత్రాత్మక పునరాగమనం అమెరికాకు కొత్త ప్రారంభాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇది భారీ విజయం... ట్రంప్ గెలుపు ఇజ్రాయెల్-అమెరికా మధ్య శక్తిమంతమైన సంబంధాలకు దోహదం చేస్తుందన్నారు.