Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
- సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదని విమర్శ
- ఐకేపీ కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో వడ్లు దళారుల పాలయ్యాయని మండిపాటు
- ఈ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు పెట్టిస్తుందని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. ఈ దఫా 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి... సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో రైతుల వడ్లు దళారుల పాలయ్యాయని విమర్శించారు. ఇది రైతు ప్రభుత్వం కాదని... రాబందు ప్రభుత్వమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు ప్రాంతాల్లో రైతులు తమ వడ్లను స్థానిక రైస్ మిల్లర్లకు, దళారులకు విక్రయించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్నో మాటలు చెప్పింది... అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క మంత్రి కూడా కల్లాల వద్దకు వెళ్లి పరిస్థితిని చూడటం లేదన్నారు. బోనస్ ఇవ్వకుండా, వడ్లను కొనుగోలు చేయకుండా రైతులకు ప్రభుత్వం నష్టం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని... వారితో కన్నీళ్లు పెట్టిస్తోందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కలుపు తీయకముందే రైతుబంధు డబ్బులు వచ్చేవని... దీంతో రైతులు సకాలంలో ఎరువులు కొనుగోలు చేసేవారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుబంధును కూడా ఎగ్గొట్టిందని విమర్శించారు. వానాకాలం, యాసంగి పంటలకు గాను ప్రభుత్వం రైతులకు రూ.7,500 చొప్పున రెండుసార్లు మొత్తం రూ.15 వేలు బాకీ పడిందన్నారు. దీనిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెండే రెండు ఉంటాయని... ఒకటి ఒట్లు... రెండు తిట్లు అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.