Kamala Harris: క‌మ‌లా హ్యారిస్ ప్ర‌సంగం.. ఓట‌మిని అంగీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

Harris delivers concession speech saying results must be accepted
  • హోవార్డ్ విశ్వవిద్యాలయంలో త‌న ఓట‌మిని అంగీక‌రిస్తూ క‌మ‌ల‌ ప్రసంగం
  • ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, ఫలితాలను అంగీకరిస్తామ‌న్న ఉపాధ్య‌క్షురాలు
  • 107 రోజుల ఎన్నిక‌ల పోరాటాన్ని తాను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌న్న క‌మ‌ల‌
అమెరికా డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్య‌క్షురాలు కమలా హ్యారిస్ వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ విశ్వవిద్యాలయంలో త‌న ఓట‌మిని అంగీక‌రిస్తూ ప్రసంగం చేశారు. "మేము ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, ఫలితాలను అంగీకరిస్తాం" అని ఆమె పేర్కొన్నారు.

"ఎన్నిక‌ల్లో మేము పోరాడిన తీరు, దాన్ని నడిపిన విధానం గురించి చాలా గర్వపడుతున్నాను. 107 రోజుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో మేము సమాజాన్ని నిర్మించడం, అతిపెద్ద‌ సంకీర్ణాల నిర్మాణం, ప్రతి రంగం నుంచి ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజ‌య‌వంతం అయ్యాం. అమెరికా భవిష్యత్తు కోసం మా పోరాటం కొన‌సాగుతుంది" అని క‌మల పేర్కొన్నారు.

"నేను ఈ ఎన్నికలలో ఓట‌మిని అంగీకరిస్తున్నాను. కానీ, ఈ ఎన్నిక‌ల్లో చేసిన‌ పోరాటాన్ని నేను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాను. కొన్నిసార్లు పోరాటానికి కొంత సమయం పడుతుంది. అంతమాత్రాన మనం గెలవలేమని కాదు" అని ఆమె అన్నారు.

ఎన్నికల ఫలితాలను అంగీకరించ‌డాన్ని ఉపాధ్యక్షురాలు నొక్కిచెప్పినట్లు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో తాను మాట్లాడానని, ఆయ‌న‌ విజయానికి అభినందనలు తెలిపానని క‌మ‌లా హ్యారిస్‌ చెప్పారు. విజ‌యం సాధించిన ట్రంప్‌కు అధికార బదిలీని శాంతియుతంగా నిర్వ‌హిస్తామ‌ని ఆమె పేర్కొన్నారు. 

మ‌రోవైపు ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రంప్ విజ‌యోత్స‌వ ప్ర‌సంగం చేశారు. ఇది దేశం మునుపెన్నడూ చూడని రాజకీయ విజయంగా ఆయ‌న తెలిపారు.
Kamala Harris
Donald Trump
US Presidential Polls
USA

More Telugu News