Merugu Nagarjuna: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై కేసులో కీలక మలుపు
- అత్యాచారం అంటూ తప్పుడు ఫిర్యాదు చేశానన్న బాధిత మహిళ
- కేసు కొట్టేయాలని హైకోర్టులో అభ్యర్థన
- నిరాకరించిన న్యాయమూర్తి
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు హైకోర్టుకి నివేదించారు. కేసును ఉపసంహరించుకుంటున్నానని ప్రమాణపత్రం దాఖలు చేశారు.
అయితే, అలా కోరగానే కేసును కొట్టేయడం కుదరదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ తెలిపారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అలాగే కేసు వివరాలను తమ ముందు ఉంచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. మేరుగు తరఫు న్యాయవాది దుశ్యంత్రెడ్డి స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు అరెస్టు నుండి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు.
కాగా, కాంట్రాక్టు పనుల పేరిట తన నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకోవడంతో పాటు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వైసీపీ నేత మేరుగు నాగార్జునపై విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మాజీ మంత్రి మేరుగుపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఈ నెల 5న నాగార్జున, ఆయన పీఏ మురళీమోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, ఫిర్యాదుదారు న్యాయస్థానంలో హాజరై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని, కేసు కొట్టేయాలంటూ ప్రమాణపత్రం దాఖలు చేశారు.