Chandrababu: కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడంతో పవన్ బాధపడ్డారు: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా పోస్టులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామని వెల్లడి
- మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారని వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామని అన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
"విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతుల్లా తయారయ్యారు... నాపై, అనితపై, పవన్ కల్యాణ్ పై కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ పైనే కాదు, ఆయన పిల్లలను కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏ ఆడపిల్లను వదలకుండా అందరి గురించి మాట్లాడుతున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా? ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా? ప్రశ్నే లేదు... చర్యలు తీసుకోవాల్సిందే. కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడంపై పవన్ కల్యాణ్ బాధపడ్డారు. ఆడబిడ్డల కన్నీటికి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
రాజకీయ ముసుగులో నేరస్తులు చెలామణి అవుతుండడం వల్లే ఈ అనర్థాలు. కొవ్వు ఎక్కువై ఇలా నేరస్తులుగా మారారు. కొవ్వు పెరిగిన వాళ్ల కొవ్వు కరిగిస్తాం. ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు ఉంటాయి. హద్దు మీరి ప్రవర్తిస్తున్నవారు ఇక ఖబడ్దార్ జాగ్రత్త! చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ఊరుకునేది లేదు.
ఎక్కడైనా శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే, అడ్డుపడాలని చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులతో మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అధికారం పోయిన వెంటనే, ఈ సైకోలు సోషల్ మీడియాలో, ఇంట్లో ఆడవాళ్ళపై ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, పోస్టులు పెడుతూ, కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.