Musi River: మూసీ ప్రక్షాళనపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy interesting comments on Musi purification

  • మూసీ ప్రక్షాళన జరగాలి... హైదరాబాద్‌కు నీరు ఇవ్వాలన్న కేంద్రమంత్రి
  • మూసీ నదికి రిటైనింగ్ వాల్ కట్టాలన్న కిషన్ రెడ్డి
  • కానీ ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టీకరణ

మూసీ ప్రక్షాళనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని... హైదరాబాద్‌కు నీరు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మూసీ నదికి కృష్ణా, గోదావరి నది నీటిని తీసుకువచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

మూసీ నదికి రిటైనింగ్ వాల్ కట్టాలని, నగరంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కానీ మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక్క ఇంటిని కూల్చినా తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.

మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండేందుకు తాము సిద్ధమన్నారు. అక్కడే బస చేస్తాం... అక్కడే ఓరోజు నిద్ర చేస్తాం... అక్కడే తింటామని కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటించడాన్ని ఆయన స్వాగతించారు.

కులగణనకు కూడా తాము వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన డీఎన్ఏ ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని... ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. గెలుపు కోణంలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బీజేపీ బృందాలు పర్యటిస్తాయన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణలో రాజకీయాలు లేవని వ్యాఖ్యానించారు. ఫ్లైఓవర్లు, ఇతర అంశాలపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు.

  • Loading...

More Telugu News