Lucky Baskhar: భాస్కర్‌ బ్యాంక్‌ దోపిడీ చేసినా ప్రేక్షకులు ఆయన వైపే నిలబడతారు: వెంకీ అట్లూరి

Audience will stand by Bhaskar even if he robs the bank Venky Atluri

  • మీడియాతో వెంకీ అట్లూరి చిట్‌ చాట్‌ 
  • ఇంత పెద్ద సక్సెస్‌ను ఊహించలేదు 
  • 'లక్కీ భాస్కర్‌'  సీక్వెల్‌ ఆలోచన లేదు

తొలిప్రేమ, సార్‌ సినిమాలతో ప్రతిభ గల దర్శకుడి నిరూపించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా దుల్కర్‌ సల్మాన్‌తో తెరకెక్కించిన  'లక్కీ భాస్కర్‌' చిత్రంతో కమర్షియల్‌ దర్శకుల జాబితాలో చేరాడు. మీనాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం జనాదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరితో జరిపిన ఇంటర్వ్యూ ఇది. 

'లక్కీ భాస్కర్' విజయం ఊహించారా? 
తప్పనిసరిగా ఓ మంచి సినిమా తీస్తున్నామనే ఫీలింగ్‌ ఉంది. కానీ ఇంతటి స్పందనను ఊహించలేదు. కథ రాసుకున్నప్పుడు కొంత మంది చిన్న చిన్న అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ మాత్రం ఇది చాలా వైడర్‌ ఆడియన్స్‌కు రీచ్‌ అవుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఇది అందరికి నచ్చింది. నా తొలిచిత్రం 'తొలిప్రేమ' సక్సెస్‌ అయినా ఎక్కడో కొంత మందిలో చాలా చిన్న అంసతృప్తి ఉండేది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎక్కడా నెగిటివ్‌ రాలేదు. సినిమా అందరికి నచ్చింది. 

సాధారణంగా ఓ సినిమా చూసినప్పుడు ఫస్ట్‌హాఫ్‌ బాగుంది.. సెకండాఫ్‌ బాగుంది.. లేదా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ బాగుంది అంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సినిమా మొత్తం బాగుంది అంటున్నారు? 
ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది.  మొదట్లో ఈ సినిమాకు ఎటువంటి రిఫరెన్స్‌ లేదు, జనాలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే చిన్నభయం ఉండేది. కానీ నేను శ్రీరాములు థియేటర్లో ఈ సినిమా చూశాను. ప్రతి మూమెంట్‌ను ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఈ సినిమాలో సంభాషణల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు? 
'ఒక రోజులో ఒక అరగంట మనకు నచ్చినట్లు ఉండకపోతే బాధపడాలా?' అనే డైలాగ్‌ను  స్పాంటేనియస్‌గా లంచ్‌ బ్రేక్‌లో రాశాను. దీంతో పాటు 'లాభం వచ్చినప్పుడే కాదు నష్టం వచ్చినప్పడు కూడా కలిసి ఉండాలి'  ఇలా సినిమాలో ప్రతి డైలాగ్‌ పేలింది. ఈ సినిమా విషయంలో దర్శకుడిగా ఎంత సంతృప్తికరంగా ఉన్నానో, రచయితగా కూడా అంతకంటే ఎక్కువ హ్యపీగా వుంది.

దుల్కర్‌ సల్మాన్‌ 'భాస్కర్‌' పాత్ర ఎంతవరకు న్యాయం చేశాడు? 
ఈ కథ వినగానే ఆయన వెంటనే సినిమా చేద్దాము అన్నారు. దుల్కర్‌ సెట్‌లో ఎంతో హ్యపీగా, ఎనర్జీతో ఉండేవాడు. ఆయన ఎనర్జీ వల్లే ఈ సినిమా ఈ రోజు ఇంత బాగా వచ్చింది. ఆయన హ్యపీనెస్‌ చూసి ఇంకా ఈ సినిమాకు ఏమైనా చేద్దామనే ఫీలింగ్‌ కలిగేది. 

భాస్కర్‌ బ్యాంక్‌ను చీటింగ్‌ చేస్తున్నాడని తెలిసినా .. ప్రేక్షకులు ఆయన వైపే నిలిచారు ఎందుకని? 
అది సినిమాలో ఉన్న ఎమోషన్‌. మధ్య తరగతి వ్యక్తిగా ఆయన పెయిన్‌ను చూసిన ప్రేక్షకులు. భాస్కర్‌ బ్యాంక్‌ను దోపిడి చేసినా ఆయన వైపే నిలిచేంతగా ఆయన పాత్రతో కనెక్ట్‌ అయ్యారు. ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్‌ చేశారు. 

లక్కీ భాస్కర్‌ సినిమాలో తప్పు చూపిస్తే పార్టీ ఇస్తాను అని నిర్మాత నాగవంశీ అన్నారు? మీరు అంతే నమ్మకంతో ఉండేవారా? 
కథ అనుకున్నప్పుడు ప్రతిది చాలా డీటెయిల్డ్‌గా రాసుకున్నాను. కానీ ఇంత భారీ సినిమా అవుతుందని అనుకోలేదు. కానీ ఈ కథను నమ్మిన నాగవంశీ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. నాతో పాటు ఆయన ఈ సినిమాను మొదట్నుంచీ ఎంతో నమ్మాడు. అందుకే అలా అని ఉంటాడు. 

80వ దశకంలో బ్యాంకింగ్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది కదా? 'లక్కీ భాస్కర్‌' సీక్వెల్‌గా ప్రజెంట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై సినిమా తీసే ఆలోచన ఉందా? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. ప్రస్తుత బ్యాంకింగ్‌ వ్యవస్థపై నాకు పెద్దగా అవగాహన లేదు. 

ఈ సినిమాపై త్రివిక్రమ్ గారి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత వరకు ఉంది? 
ఈ సినిమా విషయంలో ఒక నిర్మాతగా ఎంత ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉండాలో అంతే ఉంది. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇస్తారు కానీ ఆయన అంతకంటే ఎక్కువగా ఏమీ జోక్యం చేసుకోరు. అయితే ఒక అభిమానిగా నా ప్రతి సినిమాపై త్రివిక్రమ్ గారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. 

నటుడిగా ప్రయాణం ప్రారంభించి దర్శకుడిగా టర్న్‌ తీసుకోవడానికి కారణం ఏమిటి? 
నాకు మొదట్నుంచి దర్శకత్వం అంటే ఇష్టం. ఇక నటుడిగా మేకప్‌ వేయగానే ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ముఖం మీద కప్పినట్లు ఉండేది. యాక్టింగ్‌ అంటే ఇంట్రస్ట్‌ ఉండేది కాదు. దర్శకుడిగా కొనసాగడమే నాకు ఇష్టం. 

మీ తదుపరి చిత్రం ఏమిటి? 
ఇంకా ఏ క్లారిటి లేదు. ఎటువంటి సినిమా చేయాలో ఆలోచించలేదు. కొన్ని కథలు మాత్రం ఉన్నాయి. కాకపోతే అందరికి నచ్చే ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. 


  • Loading...

More Telugu News