YS Jagan: మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు... జగన్ ఏమన్నారంటే...!
- ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- సమావేశాలకు వైసీపీ హజరుపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో అనుమానం
- ప్రతిపక్ష హోదా ఇవ్వనందున సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మూడో అసెంబ్లీ సమావేశాలు ఇవి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసింది. కూటమి రికార్డు మెజార్టీతో ఘన విజయాన్ని అందుకుంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో తొలి సమావేశాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు.
ఇక ఆ తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదంటూ వైసీపీ సభ్యులు సమావేశాలకు డుమ్మా కొట్టారు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హజరు అవుతారా ? లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హజరు అయ్యే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తాము గళం ఎత్తుతామన్న భయంతోనే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం .. వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అటువంటప్పుడు సమావేశాలకు హజరవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హజరు కావడం లేదని స్పష్టీకరించారు. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.