Justin Trudeau: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై తొలిసారి... ట్రూడో కీలక వ్యాఖ్యలు
- కెనడాలోని సిక్కు సమాజానికి ఖలిస్థానీ వేర్పాటువాదులు ప్రాతినిధ్యం వహించరన్న ట్రూడో
- విభజించడానికి ఎవరికీ అవకాశం ఇవ్వవద్దని సూచన
- మోదీ మద్దతుదారులు కూడా హిందూ కెనడియన్లకు ప్రాతినిధ్యం వహించడం లేదని వ్యాఖ్య
ఖలిస్థాన్ వేర్పాటువాదంపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని సిక్కు సమాజానికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. దీపావళి, బండి చోర్ దివస్‌ను పురస్కరించుకొని ఒట్టావాలోని పార్లమెంట్ హిల్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రూడో పైవ్యాఖ్యలు చేశారు. ఈ దీపావళి కార్యక్రమాన్ని కేబినెట్ మంత్రులు అనితా ఆనంద్, గ్యారీ ఆనందసంగరి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ట్రూడో మాట్లాడారు.
కెనడాలో ఖలిస్థాన్‌కు చాలామంది మద్దతుదారులు ఉన్నారని వెల్లడించారు. అయితే వారు యావత్ సిక్కు సమాజానికి ప్రతినిధులు కారని పేర్కొన్నారు.
బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. హింస లేదా అసహనానికి లేదా బెదిరింపులకు లేదా విభజనకు ఇక్కడ చోటు లేదన్నారు. ప్రతి సంస్కృతికి, కమ్యూనిటీకి తాము అండగా ఉంటున్నామన్నారు. మరో విషయం ఏమంటే... మనల్ని విభజించడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకూడదన్నారు.
భారత్‌కు తాము దూరం కాలేదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వానికి ఇక్కడ చాలామంది మద్దతుదారులు ఉన్నారని, అలాగే వారు కూడా హిందూ కెనడియన్లందరికీ ప్రాతినిధ్యం వహించరన్నారు.
ట్రూడో వ్యాఖ్యలపై బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ ఉజ్జల్ స్పందిస్తూ... తనకు తెలిసినంత వరకు ట్రూడో ఖలిస్థానీలను సిక్కు సమాజం నుంచి వేరుగా చూడటం ఇదే మొదటిసారి అన్నారు. ఇప్పటికైనా ఖలిస్థానీలకు అతను దూరంగా ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులు సిక్కులకు, కెనడియన్లకు అన్యాయం చేస్తున్నారని ట్రూడో గుర్తించాలన్నారు.