Telangana: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉపసంఘం... చైర్మన్ గా భట్టి విక్రమార్క
- సమస్యల పరిష్కారానికి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉద్యోగుల జేఏసీ నేతలు
- కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సీఎం
- కేబినెట్ కమిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నేతలు
తెలంగాణలో ఉద్యోగుల జేఏసీ నేతలకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేశారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇటీవల ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఆ సమయంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కె. కేశవరావు సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. త్వరగా సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.