Fake Currency Notes: యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ నోట్ల తయారీ... చివ‌రికి జ‌రిగింది ఇదీ!

With YouTube As Guide UP Men Printed Rs 500 Notes On Rs 10 Stamp Paper
  • యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో ఘ‌ట‌న‌
  • ప‌ది రూపాయల స్టాంప్‌ పేపర్లపై నకిలీ రూ. 500 నోట్లను ముద్రించిన కేటుగాళ్లు
  • ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ రాకెట్‌ను నడుపుతున్న ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి రూ. 30,000 విలువైన న‌కిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.  
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితులు సతీశ్‌ రాయ్‌, ప్రమోద్‌ మిశ్రా ప‌ది రూపాయల స్టాంప్‌ పేపర్లపై నకిలీ రూ. 500 నోట్లను ముద్రిస్తున్నారు. మీర్జాపూర్ నుంచి స్టాంప్ పేపర్ కొనుగోలు చేసి ఈ దందాను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. అన్ని నోట్లకు ఒకే వరుస నంబర్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

వీరిద్దరూ సోన్‌భద్రలోని రామ్‌గఢ్ మార్కెట్‌లో రూ. 10వేల విలువైన‌ నకిలీ కరెన్సీ నోట్లను చెలామ‌ణి చేస్తున్న స‌మ‌యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాము 20 రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామ‌ని, అవి అచ్చం నిజమైన నోట్ల మాదిరిగానే ఉన్నాయ‌ని అదనపు పోలీసు సూపరింటెండెంట్ కలు సింగ్ తెలిపారు. నిందితులు యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లను ముద్రించడం నేర్చుకున్నారని పోలీసులు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల నుంచి నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ఆల్టో కారు, నోట్ల ముద్రణకు ఉపయోగించే పరికరాలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency Notes
YouTube
Uttar Pradesh

More Telugu News