Manifesto: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
- నవంబరు 20న మహారాష్ట్రలో ఎన్నికలు
- హామీలతో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు
- వృద్ధుల పెన్షన్ రూ.2,100కి పెంచుతామని బీజేపీ హామీ
- యువతకు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అమిత్ షా వెల్లడి
- రూ.25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
మహారాష్ట్రలో ఎన్నికల కుంపటి బాగా రగులుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల హామీలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
ఈ సభలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ , మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే, ముంబయి బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షేలార్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ మేనిఫెస్టోలో... మహారాష్ట్రలో వృద్ధుల పెన్షన్ ను రూ.2,100కు పెంచుతామని తెలిపారు. మహారాష్ట్రలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో స్కిల్ సెన్సస్ చేపడతామని అమిత్ షా వెల్లడించారు. మహిళల లఖ్ పతి దీదీ పథకాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు.
ఎరువులపై రైతులు చెల్లించే జీఎస్టీని తిరిగి ఇచ్చేస్తామని, తద్వారా ఆర్థికభారం తగ్గిస్తామని వివరించారు. మహారాష్ట్రలో పరిశ్రమల అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. రూ.25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామని అమిత్ షా వివరించారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు, నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నారు. నవంబరు 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.