G. Kishan Reddy: తెలంగాణ సీఎం వచ్చి అబద్ధాలు చెప్పాడు: మహారాష్ట్రలో కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy blames Revanth Reddy and Rahul in Maharashtra
  • కాంగ్రెస్ చేసిన మోసాలు చెప్పేందుకే తాను వచ్చానన్న కిషన్ రెడ్డి
  • ఆరు గ్యారెంటీలు, 420 హామీలు కాంగ్రెస్ అమలు చేయలేదన్న కేంద్రమంత్రి
  • మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలనుకుంటున్నారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి అబద్ధాలు చెప్పారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ముంబైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ చెప్పిన మోసాలను వెల్లడించేందుకే తాను మహారాష్ట్రకు వచ్చానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 99 శాతం హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు.

ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అందరూ మోసపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడీ తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో, అదే తరహాలో మహారాష్ట్రలో కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని ఆరోపించారు. 'ఆర్ఆర్' ట్యాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చు పెడుతున్నారన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, అప్పులు కట్టవద్దని చెప్పి... ఇప్పుడు వారిని మోసం చేశారని మండిపడ్డారు. ఒక్క ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేయలేదు... కానీ హైదరాబాద్‌లో మాత్రం మూసీ పేరుతో దశాబ్దాలుగా ఉంటున్న వారిని గెంటి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రకు వచ్చి అమలు చేశామని చెప్పడం విడ్డూరమన్నారు. గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని... కానీ ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని నిరూపిస్తానంటే ముంబై ప్రెస్ క్లబ్ ఎదుట తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పదేళ్ల పాటు తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేస్తే... ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందన్నారు.
G. Kishan Reddy
Congress
BJP
Telangana
Revanth Reddy

More Telugu News