BR Naidu: టీటీడీ చైర్మన్ అవ్వాలనే కోరిక అప్పట్నించే ఉంది: బీఆర్ నాయుడు
- ఇటీవల టీటీడీ చైర్మన్ గా నియమితుడైన బీఆర్ నాయుడు
- కొన్ని రోజుల కిందటే పదవీ బాధ్యతల స్వీకరణ
- చంద్రబాబు, లోకేశ్, పవన్ లకు కృతజ్ఞతలు తెలుపుకున్న నాయుడు
టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా నియమితులయ్యారు. కొన్నిరోజుల కిందటే ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఓ మీడియా చానల్ బీఆర్ నాయుడును ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.
తాను ఎంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి కీలక పదవిని తాను చేపట్టిన విషయం ఊహకు అందడంలేదని బీఆర్ నాయుడు అన్నారు. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబుకు, నారా లోకేశ్ కు, పవన్ కల్యాణ్ కు, మిగిలిన ఎన్డీయే పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
టీటీడీ చైర్మన్ పదవిపై తాను ఆశపడిన మాట వాస్తవమేనని అన్నారు. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ అవ్వాలి, దేవుడికి సేవ చేయాలని కోరుకున్నానని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటినుంచి తనలో ఈ కోరిక ఉందని, అప్పట్లో ప్రయత్నం కూడా చేశానని, కానీ ఫలించలేదని బీఆర్ నాయుడు వివరించారు. చంద్రబాబును ఒకటిన్నర ఏడాది కింద స్వయంగా అడిగానని వెల్లడించారు.
"అన్నా... టీటీడీ చైర్మన్ గా సేవ చేయాలని ఉంది అని చంద్రబాబుకు వివరించాను. 40 ఏళ్ల నుంచి ప్రతి విషయంలో మీతో ఉన్నాను... ఇంతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు... నాకొక అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నాను. దాంతో చంద్రబాబునాయుడు కొంతసేపు ఆలోచించి... సానుకూలంగా స్పందించారు. ఆ పదవికి మీరు అర్హులు అని అన్నారు.
ఇక ఎన్నికలు అయిపోయాక జూన్ 29న వెళ్లి కలిశాను. టీటీడీ చైర్మన్ పదవిపై మీరు హామీ ఇచ్చారు... అని ఆయనకు గుర్తుచేశాను. నేను మాటిచ్చాను కదా... తప్పకుండా చేస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నన్ను టీటీడీ చైర్మన్ ను చేశారు" అని వివరించారు.
దర్శనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రద్దీ సమయాల్లో భక్తులను ఓ కంపార్ట్ మెంట్ లో వేసి 30 గంటల పాటు లాక్ చేయడం, ఆ తర్వాత దర్శనానికి వదిలి, కేవలం కొన్ని సెకన్ల పాటే దేవుడ్ని చూసే అవకాశం కల్పించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అన్ని గంటలు ఎదురుచూసిన భక్తుడు మహా లఘు దర్శనంలో భాగంగా కొన్ని సెకన్ల పాటు దేవుడ్ని చూసి ఏం సంతృప్తి చెందుతాడని అన్నారు. ఆ విధంగా అయితే... ఒకసారి తిరుమల వచ్చిన భక్తులు మళ్లీ రారని అన్నారు. అందుకే కనీసం 20 సెకన్లు పాటు అయినా భక్తులకు దర్శనాలు కల్పించాలన్నది తన ఉద్దేశం అని బీఆర్ నాయుడు వెల్లడించారు.
ఇక వీఐపీ భక్తులకు దర్శనాలు గంట, గంటన్నర మాత్రమేనని, మిగిలిన రోజంతా సామాన్య భక్తులకే దర్శన అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.