Patnam Narendar Reddy: లగచర్ల ఘటన... పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
- నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన కొడంగల్ కోర్టు
- లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలతో అరెస్ట్
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు... కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
లగచర్ల ఘటనలో పోలీసులు 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో ఈ రోజు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.
నా అరెస్ట్ అక్రమం: పట్నం నరేందర్ రెడ్డి
కోర్టుకు తరలించే క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ అక్రమమన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కొడంగల్లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి పరువు పోయిందని మండిపడ్డారు. లగచర్ల ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.