Nadendla Manohar: రేష‌న్ మాఫియా అక్రమార్కులకు మంత్రి నాదెండ్ల వార్నింగ్

Minitster Nadendla warns Ration mafia

  • రేషన్ అవినీతిపరుల అరెస్టులు త‌ప్ప‌వన్న మంత్రి నాదెండ్ల
  • కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,010 కేసులు న‌మోదు చేసినట్టు వెల్లడి
  • 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నామని వివరణ
  • అక్ర‌మ ర‌వాణా జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రమని పిలుపు

ఏపీ పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే... కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని అన్నారు. 

శాస‌న‌మండ‌లిలో ఆయ‌న మాట్లాడుతూ, బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,010 కేసులు నమోదు చేయ‌డంతో పాటు 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. విచార‌ణ అనంత‌రం అక్ర‌మార్కుల అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. రేషన్ లో అవినీతికి పాల్పడిన వారు తమ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై తనిఖీలు జరుగుతున్నాయ‌ని, ఇప్పటికే కృష్ణా, గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వయంగా తానే తనిఖీలు నిర్వహించిన‌ట్లు గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీలు నిర్వ‌హించి క్రిమినల్ కేసులు నమోదు చేసిన‌ట్టు నాదెండ్ల పేర్కొన్నారు. పేదల‌కు అందాల్సిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్‌ల‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. 

సంస్కరణల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసీ సర్టిఫికెట్ ఉంటేనే పోర్ట్ అధికారులు బియ్యం ఎగుమతికి అనుమతించడం జరుగుతుంద‌న్నారు. కూటమి ప్రభుత్వం కిలో 43 రూపాయల 40 పైసల‌కు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు కూడా అడ్డుకోవాలని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పిలుపునిచ్చారు. 

పీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండీయూ ఆపరేటర్ల ప్రమేయం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎనిమిది మంది ఎండీయూ ఆపరేటర్లకు జరిమానా విధించ‌డంతో పాటు ఒక ఎండీయూ ఆపరేటర్‌ను తొలగించడం జరిగింద‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ శాస‌న‌మండ‌లిలో వివ‌రించారు.

  • Loading...

More Telugu News