Russian Chef: పుతిన్ ను విమర్శించిన రష్యన్ చెఫ్ సెర్బియా హోటల్ లో మృతి
- 2014 లో పుతిన్ ను విమర్శించి రష్యా వీడిన చెఫ్ అలెక్సై జిమిన్
- లండన్ లో స్థిరపడి టీవీ షోలు చేసుకుంటున్న వైనం
- బెల్ గ్రేడ్ లోని ఓ హోటల్ లో జిమిన్ మృతదేహం గుర్తింపు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ విమర్శకుడు మరొకరు అనుమానాస్పదంగా చనిపోయారు. సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లోని ఓ హోటల్ గదిలో మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. రష్యాలో ప్రముఖ చెఫ్ గా పేరొందిన అలెక్సై జిమిన్ తాజాగా సెర్బియాలో చనిపోయారు. టీవీ వ్యాఖ్యతగా, వంటల పోగ్రాం నిర్వహించే జిమిన్ ప్రెసిడెంట్ పుతిన్ ను బహిరంగంగా విమర్శించారు. దీంతో అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షోను ప్రభుత్వం నిలిపివేసింది.
ఆ తర్వాత రష్యాలో ఉండలేక ప్రాణభయంతో 2014లో లండన్ వెళ్లిపోయాడు. అక్కడే స్థిరపడి రెస్టారెంట్ బిజినెస్ చేసుకుంటూ, టీవీ షోలలో పాల్గొంటున్నాడు. 2022 లో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుండడం చూసి అలెక్సై జిమిన్ మరోసారి పుతిన్ పై విమర్శలు చేశారు. ఇటీవల జిమిన్ సెర్బియాకు వెళ్లాడు. బ్రిటన్ ఆంగ్లోమానియాపై తను రాసిన పుస్తకం ప్రమోషన్ కోసం బెల్ గ్రేడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
రాత్రి హోటల్ లో బస చేసిన జిమిన్.. తెల్లారేసరికి విగతజీవిగా మారాడు. మృతదేహాన్ని చూసి హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో బెల్ గ్రేడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టారు. హోటల్ గదిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, జిమిన్ మరణం సహజంగానే జరిగినట్లు ఉందని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టులో జిమిన్ మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.
కాగా, ముందురోజు రాత్రి జిమిన్ ను కలిసి కాసేపు మాట్లాడానని స్థానిక రెస్టారెంట్ ఓనర్ ఒకరు చెప్పారు. ఆ సమయంలో ఆయన ఉల్లాసంగా కనిపించారని గుర్తుచేసుకున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా తెల్లవారేసరికి జిమిన్ చనిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.