Ponguleti Srinivas Reddy: కలెక్టర్‌పై దాడి చేశారంటే... భారీ కుట్రకోణం ఉందని అర్థమవుతోంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy see conspiracy in Lagacharla issue
  • రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శ
  • ఇలాంటి చిల్లర, అవకాశవాద రాజకీయాలతో మనుగడ సాగించలేరని వ్యాఖ్య
  • రైతుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ
జిల్లా కలెక్టర్, అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారంటే దాని వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందనే విషయం అర్థమవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందని అర్థమవుతోందన్నారు.

ఇలాంటి చిల్లర, అవకాశవాద రాజకీయాలతో ఎంతోకాలం మనుగడ సాగించలేరన్నారు. పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలి చేయడం సరికాదన్నారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి దారుణం అన్నారు. రైతుల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

రైతుల ముసుగులో అధికారులపై దాడి చేసి చంపే ప్రయత్నం సరికాదన్నారు. ఈ ఘటనను తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇప్పుడు అధికారులపై దాడి చేసిన వాళ్లు తర్వాత ప్రజలపై, నాయకులపై దాడి చేయరనే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. రైతుల ముసుగులో గులాబీ గూండాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ గూండాల కుట్రలను రైతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Ponguleti Srinivas Reddy
KTR
Revanth Reddy
Congress

More Telugu News