BJP: సుప్రీంకోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు అధికారాలు ఇచ్చారు: బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
- వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యమని ఎద్దేవా
- రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వక్ఫ్ బోర్డును తెచ్చిందని మండిపాటు
- వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా... కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డును తీసుకువచ్చిందని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు అధికారాలు ఇచ్చారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యమని, నవ్వాలో... ఏడవాలో... బాధపడాలో తెలియని పరిస్థితి అన్నారు.
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని గుర్తించాలన్నారు.
300 ఏళ్ల క్రితం ఔరంగజేబు నోటి మాటతో భూములు ఇచ్చి ఉండవచ్చని... కానీ ఈరోజు కుప్పలు కుప్పలుగా డాక్యుమెంట్లతో ఆ భూములు తమవి అంటున్నారని వాపోయారు. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే అన్నారు.