AP Govt: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
- అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు
- ఐఐటీ మద్రాస్ తో 8 విభాగాల్లో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరం తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటీ మద్రాస్ తో కూటమి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటీ మద్రాస్ నిర్ణయించింది.
ఐఐటీ-ఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. సాయంత్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికా శుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటీ మద్రాస్ డైరక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారథి, ఎంజే శంకర్ రామన్ (సీఈవో, ఐఐటీ-ఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్), ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల (మాజీ డీన్, ఐఐటీ-ఎం కార్పొరేట్ రిలేషన్స్), ప్రొఫెసర్ రవీంద్రన్ (హెడ్, సెంటర్ ఫర్ రెస్పాన్సిబిల్ ఎఐ), రాజేష్ (ఐఐటీ-ఎం అల్యూమినస్), చెన్నై సీఎంవో అధికారి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
1. ఐఐటీఎం–ఏపీ సీఆర్డీయే ఒప్పందం
అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహాల కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటీఎం సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది.
2. ఐఐటీఎం – ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం
సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.
3. ఐఐటీఎం – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందం
స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫాంల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
4). ఐఐటీఎం – ఏపీ విద్యాశాఖ ఒప్పందం
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరుపార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఐటీఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఏపీలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.
5). ఐఐటీఎం – ఇన్వెస్టిమెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం
విమానాశ్రయాలను లాజిస్టిక్స్ / మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.
6. ఐఐటీఎం – ఐటీ శాఖ ఒప్పందం
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేయడం... తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ ఒప్పందం ఉద్దేశం.
7. ఐఐటీఎం – ఆర్టీజీఎస్ శాఖ ఒప్పందం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటీఎం ప్రవర్తక్ తో ఏపీ ఆర్టీజీఎస్ కలసి పనిచేస్తుంది.
8. ఐఐటీఎం – క్రీడల శాఖ ఒప్పందం
అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది.